భారత్‌కు వస్తున్న క్రిస్టోఫర్ నోలన్! ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ఇండియా ప్రిమియర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) జూలై 17, 2026న థియేటర్లలోకి రానుంది. అయితే, అంతకంటే ముందే భారతీయ అభిమానులకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ 'యూниవర్సల్ పిక్చర్స్' ఒక అద్భుతమైన వార్తను అందించింది. ఈ సినిమా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ప్రిమియర్ టూర్ లో భాగంగా మన భారతదేశాన్ని అధికారిక వేదికగా ఎంచుకున్నారు. ముంబై లోని లోయర్ పరేల్ లో ఉన్న ప్రసిద్ధ 'పివిఆర్ ఐకాన్ ఐమాక్స్' (PVR ICON IMAX, Phoenix Palladium) థియేటర్ వేదికగా ఈ గ్రాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జూలై 10 మరియు జూలై 11 (రెండు రోజుల పాటు) ఒక భారీ ప్రమోషనల్ టూర్‌గా సాగనుంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చే ఒక సినిమాకు ఈ స్థాయిలో ఇండియాలో అఫీషియల్ ప్రిమియర్ జరగడం ఇదే మొదటిసారి.
ముంబైకి వస్తున్న అఫీషియల్ గెస్ట్ లిస్ట్ (The Hollywood Guests)-
ఈ రెండు రోజుల పర్యటన కోసం ముంబై రాబోతున్న హాలీవుడ్ అతిథుల జాబితాను యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ఖరారు చేసింది. వారు:
* క్రిస్టోఫర్ నోలన్: (దర్శకుడు/రచయిత)
* ఎమ్మా థామస్: ఆస్కార్ అవార్డు గ్రహీత మరియు ఈ చిత్ర ప్రధాన నిర్మాత.
* మ్యాట్ డామన్: చిత్ర కథానాయకుడు (ఒడీసియస్ పాత్రధారి).
* టామ్ హాలండ్: స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్ ఈ చిత్రంలో ఒడీసియస్ కుమారుడైన 'టెలిమాకస్' (Telemachus) పాత్రలో నటిస్తున్నారు.
లండన్, ప్యారిస్, న్యూయార్క్ వంటి ప్రపంచ టాప్ నగరాల సరసన ముంబైని కూడా చేర్చి, ఈ హాలీవుడ్ సూపర్ స్టార్లు అందరూ ఒకే వేదికపై ఇక్కడి ఐమాక్స్ థియేటర్ లో సందడి చేయనుండటం ఇండియన్ సినిమా మార్కెట్ యొక్క ఎదుగుదలకు నిదర్శనం.
ఫిల్మ్ రీల్స్ రక్షణ కోసం నాడు ముంబై పర్యటన... నేడు 2 మిలియన్ అడుగుల ఫిల్మ్‌తో పునరాగమనం! -
నోలన్, ఎమ్మా థామస్ లతో కూడిన ఈ బృందం ముంబైకి రాబోతున్న ఈ తరుణంలో... నోలన్ గతంలో ముంబైకి చేసిన ఒక చారిత్రాత్మక పర్యటనను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ 'సెల్యులాయిడ్ ఫిల్మ్ రీల్స్' (Physical Film Reels) వాడకం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఫిల్మ్ రీల్స్ యొక్క క్వాలిటీని అమితంగా ప్రేమించే నోలన్... 2018లో ముంబైకి వచ్చి ఇక్కడి కోడక్ (Kodak) ల్యాబ్‌లను సందర్శించి, ఫిల్మ్ రీల్స్ ఉనికిని కాపాడటం కోసం 'రిఫ్రేమింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్' క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు ముంబై వచ్చిన నోలన్... అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి ఇండియన్ సినిమా దిగ్గజాలతో సెల్యులాయిడ్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ గురించి చర్చలు జరిపారు. నాడు ఫిల్మ్ రీల్స్ భద్రత కోసం ముంబైలో అడుగుపెట్టిన అదే నోలన్... నేడు అదే ఫిల్మ్ ఫార్మాట్లో ఏకంగా 20 లక్షల అడుగుల ఐమాక్స్ ఫిల్మ్ వాడి తాను సృష్టించిన కెరీర్ బెస్ట్ విజువల్ వండర్‌తో, అదే ముంబై నగరంలోని పివిఆర్ ఐకాన్ ఐమాక్స్ లో అడుగుపెడుతుండటం ఒక అద్భుతమైన క్లోజర్ అని చెప్పవచ్చు.




