
ఏలూరు నగర గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ మరియు శ్రీ పోతురాజు బాబులకు ప్రతి 7 సంవత్సరములకు ఒకసారి జరిగే జాతర ఈసారి 2025 లో దీపావళి తర్వాత మొదలై 2026 సంక్రాంతి పండుగ తర్వాత వరకు జరిగింది. నగరం నలువైపులా విస్తరించడం వల్ల భక్తులకు చేరువలో ఉండేటందుకు, ఈ పర్యాయం జాతర పడమర వీధి, తూర్పు వీధి, పవర్ పేట, దక్షిణపు వీధి, తంగెళ్లమూడి, ఆదివారపు పేట మరియు లక్ష్మివారపు పేట అనబడు 7 వేర్వేరు ప్రదేశాలలో విశేష వేడుకలతో ఘనంగా జరిగింది. ఇటీవల ముగిసిన ఈ జాతరకు సంబంధించిన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.
పడమర వీధి

పడమర వీధి శనగపప్పు బజారు, ఐదు కొట్ల సెంటర్ లో శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి గుడి పక్కన జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 అక్టోబరు 26న జాతర ముడుపు కట్టుట మరియు పందిరిరాట వేయుట జరిగింది. నవంబరు 5న అమ్మవార్లకు స్నానాలు చేయించి, పెద్ద రైల్వే స్టేషన్ వద్దనున్న బావిలో నుంచి ఘటావాహన చేసి, అటు తర్వాత అమ్మవార్లను భూమి మీద పాదం మోపించి 4 పగళ్ళు 3 రాత్రులు నగర సంచారం చేయించారు. నవంబరు 8న గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. నవంబరు 24న వినుకొండ అంకమ్మను భూమి మీద పాదం మోపించి 3 పగళ్ళు 3 రాత్రులు నగర సంచారం చేయించారు. నవంబరు 27న వినుకొండ అంకమ్మను మేడల లోకి ప్రవేశింప చేశారు. 2026 జనవరి 8న ఉదయం నల్ల మారెమ్మను పందిరిలోకి ఆహ్వానించి, సాయంత్రం ఊరేగింపుతో పోలిమేర వరకు సాగనంపారు. జనవరి 31న కొర్లబండిని ఊరేగించి, పందిరిలో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖున సుమారు 2000 మంది కళాకారులతో 63 విశేష వేషాలతో నగర పొలిమేర వరకు కొర్లబండిలో అమ్మవారిని సాగనంపుట జరిగింది.
తూర్పు వీధి

తూర్పు వీధి గంగానమ్మ గుడిలో జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 23న అమ్మవార్లకు స్నానాలు చేయించి, పోలిమేర దగ్గర ఘటావాహన చేసి, అటు తర్వాత 3 రాత్రులు 4 పగళ్ళు నగర సంచారం చేయించారు. నవంబరు 26న మేడల దగ్గర అమ్మవారి ముగ్గు వేసి, రాత్రి మెడల లోకి గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ మరియు పోతురాజు బాబులను ప్రవేశింప చేశారు. డిసెంబరు 13న వినుకొండ అంకమ్మను భూమి మీద పాదం మోపించి, 1 రాత్రి 2 పగుళ్లు నగర సంచారం చేయించారు. డిసెంబరు 14న వినుకొండ వినుకొండ అంకమ్మ ముగ్గు వేసి, రాత్రి అమ్మవారిని మేడల లోకి ప్రవేశింప చేశారు. 2026 జనవరి 4న ఉదయం నల్ల మారెమ్మను పందిరిలోకి ఆహ్వానించి, సాయంత్రం ఊరేగింపుతో పోలిమేర వరకు సాగనంపారు. మేడల వద్ద జరిగిన ప్రత్యేక వేడుకలలో డిసెంబరు 4న సుడి కప్పిరి ముగ్గు, జనవరి 11న పుల కప్పిరి ముగ్గు మరియు జనవరి 22న జరిగిన ఏకమాను వేపకలపతో ప్రత్యేక పద్ధతిలో తయారుచేయబడిన కొర్లబండిని పూరవీధులలో ఊరేగించడం ప్రధానమైనవి. 2026 జనవరి 25న అమ్మవారి మేడల దగ్గర జాతర ముగ్గు వేయించి, మహాకుంభం సమర్పించారు. జనవరి 26న అనేక విశేష వేషాలతో నగర పొలిమేర వరకు కొర్లబండిలో అమ్మవారిని సాగనంపారు.
పవర్ పేట

పవర్ పేట వాసు దేవాలయం దగ్గరలో జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 9న జాతర ముడుపు కట్టి, పందిరిరాట పాతారు. నవంబరు 26న అమ్మవార్లకు స్నానాలు చేయించి, పొలిమేర నుంచి ఘటావాహన చేసి, అమ్మవార్లను భూమి మీద పాదం మోపించి, 4 పగుళ్లు 3 రాత్రులు నగర సంచారం చేయించారు. నవంబరు 29న రాత్రి గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. డిసెంబరు 14న ఉదయం వినుకొండ అంకమ్మను భూమి మీద పాదం మోపించి, ఊరేగించి, రాత్రి మెడల లోకి ప్రవేశం చేశారు. 2026 జనవరి 24న అమ్మవారి వాహనమైన కొర్లబండిని ఊరేగించారు. జనవరి 25న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించి, 26న సంబరంగా అమ్మవారిని పొలిమేర వరకు కొర్లబండిలో సాగనంపారు.
దక్షిణపు వీధి

దక్షిణపు వీధి మార్కండేయ స్వామి గుడి ఎదురుగా జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 27న పోలిమేర నుంచి ఘటావాహన చేశారు. నవంబరు 30న అమ్మవార్లను భూమి మీద పాదం మోపించి 4 పగలు 3 రాత్రులు నగర సంచారం చేయించారు. డిసెంబరు 20న వినుకొండ అంకమ్మను భూమి మీద పాదం మోపించి, 2 పగుళ్లు 1 రాత్రి నగర సంసారం చేయించారు. డిసెంబరు 21న గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. 2026 జనవరి 11న ఉదయం నల్ల మారెమ్మను పందిరిలోకి ఆహ్వానించి, సాయంత్రం పొలిమేర వరకు సాగనంపారు. జనవరి 22న అమ్మవారి వాహనమైన కొర్లబండిని ఊరేగించి, సాయంత్రం పందిరిలోకి ప్రవేశపెట్టారు. జనవరి 25న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించి, 26న సంబరంగా అమ్మవారిని పోలిమేర వరకు కొర్లబండిలో సాగనంపారు.
తంగెళ్ళమూడి

తంగెళ్ళమూడిలోని యాదవ్ నగర్ రామాలయం వద్ద జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 27న గంగానమ్మకు స్నానములు ఆచరించి, ఘటావాహన చేసి, పొలిమేర నుంచి ఆహ్వానించి, రామాలయం దగ్గర జాతర ముడుపు కట్టి, పందిరిరాట పాతారు. 2026 జనవరి 11న అమ్మవార్లను భూమి మీద పాదం మోపించి, 1 పగలు 1 రాత్రి నగర సంసారం చేయించి, జనవరి 12న గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. ఫిబ్రవరి 1న ఉదయం నల్ల మారెమ్మను ఆహ్వానించి, సాయంత్రం పొలిమేర వరకు సాగనంపారు. ఫిబ్రవరి 8న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించి, ఫిబ్రవరి 9న సంబరంగా అమ్మవారిని పొలమేర వరకు కొర్లబండిలో సాగనంపారు.
ఆదివారపు పేట

ఆదివారపు పేట గంగానమ్మ గుడి ఎదురుగా జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 16న అమ్మవారికి జాతర మడుపు కట్టి, పందిరిరాట పాతారు. 2026 జనవరి 10న ఉదయం ఘటావాహన చేసి, రాత్రి గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. జాతరలో జరిగిన ప్రత్యేక వేడుకలలో జనవరి 11న మొదటి ముగ్గుతో గంగానమ్మ కథ, 14న రెండవ ముగ్గుతో వినుకొండ అంకమ్మ కథ, 15న పువ్వుల కప్పిరి వేడుకలు, 16న పవర్ పేట అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వడం, 17న గారెల కప్పిరి వేడుకలు, 18న అమ్మవారికి స్నానం చేయించుట, 19న బూరెల కప్పిరి వేడుకలు, 21న మూడవ ముగ్గు ప్రధానమైనవి. జనవరి 25న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించి, 26న పవర్ పేట అమ్మవారి కొర్లబండిలో పొలిమేర వరకు అమ్మవారిని సాగనంపారు.
లక్ష్మివారపు పేట

లక్ష్మివారపు పేట గంగానమ్మ గుడి వద్ద జరిగిన ఈ జాతర మహోత్సవం 2025 నవంబరు 3న జాతర ముడుపు కట్టి, పందిరిరాట వేశారు. 2026 జనవరి 15న ఘటావాహన చేసి, గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ మరియు పోతురాజు బాబులను మేడల లోకి ప్రవేశింప చేశారు. జాతరలో జరిగిన ప్రత్యేక వేడుకలలో జనవరి 16న మొదటి ముగ్గుతో గంగానమ్మ కథ, 17న రెండవ ముగ్గుతో వినుకొండ అంకమ్మ కథ, 18న పువ్వులు కప్పిరి వేడుకలు, 19న మూడవ ముగ్గుతోత మూడవ కథ, 21న గారెల కప్పిరి వేడుకలు, 22న బూరెలు కప్పిరి వేడుకలు, 23న సారె సమర్పించడం ప్రధానమైనవి. జనవరి 25న అమ్మవార్లకు మహాకుంభం సమర్పించారు. జనవరి 26న మధ్యాహ్నం అమ్మవారికి పుట్టింటి వారి ఇంట్లో పాన్పు ఇచ్చి, సాయంత్రం తూర్పు వీధి గంగానమ్మ కొర్లబండిలో పొలిమేర వరకు సాగనంపారు.
అసంఖ్యాకమైన భక్తులు తాకిడితో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర మహోత్సవమును సజావుగా కొనసాగించిన ఏలూరు జిల్లా కలెక్టర్, ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, పోలీసు వారు మరియు జాతర కమిటీల సభ్యులకు ప్రత్యేక ప్రశంసలు.

