Jeevana Rekha Logo
Jeevana Rekha Logo
రేఖ ఫ్లాష్
థీమ్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం
national

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం

By Gunturi Sankar, Jeevana Rekha

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026కు పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను ఈ బిల్లు సవరిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగి, ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉండాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉంటుందని చట్టం పేర్కొన్నప్పటికీ, ఆ రాజధాని పేరును స్పష్టంగా నిర్దేశించలేదు.

తాజా సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని 'అమరావతి' అని చట్టంలో స్పష్టంగా పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర విభజన చట్టంలోనే అమరావతి పేరు రాజధానిగా నమోదు కానుంది.

2014లో రాష్ట్ర విభజన అనంతరం గుంటూరు, విజయవాడ నగరాల మధ్య కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రభుత్వ మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదన, న్యాయపరమైన వివాదాలతో రాష్ట్ర రాజధాని అంశం సుదీర్ఘకాలం చర్చనీయాంశంగా కొనసాగింది.

2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధానిగా అమరావతి పేరు లేకపోవడంతో, భవిష్యత్తులో రాజధాని విషయంలో చట్టపరమైన అస్పష్టతకు అవకాశం లేకుండా కేంద్ర చట్టంలోనే పేరు పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆమోదించిన తాజా సవరణ అమరావతి విషయంలో కీలక చట్టపరమైన పరిణామంగా నిలిచింది.

బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించిన అనంతరం అమరావతి పేరు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో అధికారికంగా చేరనుంది.