సూపర్‌కార్ల ప్రపంచంలో దశాబ్దాలుగా శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్లకు పర్యాయపదంగా నిలిచిన ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. సంస్థ చరిత్రలో తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు 'ఫెరారీ లూచే'ను సోమవారం రోమ్‌లో ఆవిష్కరించింది.
నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందించిన లూచే 1,000 హార్స్‌పవర్‌కు పైగా శక్తిని ఉత్పత్తి చేయగలదు. 122 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించిన ఈ కారు సుమారు 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఫెరారీ తెలిపింది.
గరిష్ఠ వేగం గంటకు 310 కిలోమీటర్లకు పైగా ఉండగా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణ పరిధిని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే లూచే ప్రత్యేకత కేవలం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ మాత్రమే కాదు.
యాపిల్ మాజీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ సర్ జోనీ ఐవ్, ప్రముఖ డిజైనర్ మార్క్ న్యూసన్‌కు చెందిన 'లవ్‌ఫ్రం' సంస్థతో కలిసి ఫెరారీ ఈ కారు రూపకల్పన చేసింది. కారు బాహ్య రూపంతో పాటు ఇంటీరియర్, వినియోగదారు ఇంటర్‌ఫేస్ రూపకల్పనలోనూ ఈ భాగస్వామ్యం కొనసాగింది.
ఆధునిక కార్లలో భారీ టచ్‌స్క్రీన్‌ల వినియోగం పెరుగుతున్న సమయంలో లూచేలో భౌతిక బటన్లు, డయల్స్, టాగుల్స్, స్విచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రత్యేకంగా నిలుస్తోంది. వీటితో పాటు డిజిటల్ డిస్‌ప్లేలను సమన్వయం చేశారు.
ఎలక్ట్రిక్ కార్లలో సంప్రదాయ ఇంజిన్ శబ్దం ఉండదు. అయితే డ్రైవర్‌కు ఫెరారీకి ప్రత్యేకమైన యాంత్రిక అనుభూతిని అందించేందుకు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో ఏర్పడే సహజ వైబ్రేషన్లను గుర్తించి శబ్దంగా వినిపించే ప్రత్యేక వ్యవస్థను సంస్థ అభివృద్ధి చేసింది.
లూచే నాలుగు తలుపులు, ఐదు సీట్లతో రావడం కూడా ఫెరారీ సంప్రదాయ సూపర్‌కార్ నమూనాతో పోలిస్తే భిన్నమైన అడుగు.
ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ విద్యుతీకరణ వైపు మారుతున్నప్పటికీ, అధిక పనితీరు కలిగిన లగ్జరీ కార్ల విషయంలో అంతర్గత దహన ఇంజిన్లకు ఉన్న భావోద్వేగ అనుబంధం ఇప్పటికీ బలంగానే ఉంది. ముఖ్యంగా ఫెరారీ వంటి బ్రాండ్‌కు ఇంజిన్ శబ్దం, గేర్ మార్పులు, డ్రైవింగ్ అనుభూతి దాని గుర్తింపులో భాగంగా ఉన్నాయి.
అందుకే లూచే కేవలం ఫెరారీ తయారు చేసిన మరో కొత్త మోడల్ కాదు. శతాబ్ద కాలానికి చేరువవుతున్న తన ఆటోమొబైల్ వారసత్వాన్ని ఎలక్ట్రిక్ యుగంలో ఫెరారీ ఎలా పునర్నిర్వచించుకుంటుందో చూపించే తొలి ప్రయత్నంగా ఇది నిలవనుంది.




