బ్యాంకులు వినియోగదారులకు అవసరం లేని బీమా, పెట్టుబడి తదితర ఆర్థిక ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడం, డిజిటల్ వేదికల్లో వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే 'డార్క్ ప్యాటర్న్స్'ను ఉపయోగించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన ఆంక్షలు విధించింది.
ఆర్థిక ఉత్పత్తుల ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలకు సంబంధించిన బాధ్యతాయుత వ్యాపార ప్రవర్తన నిబంధనలను ఆర్‌బీఐ సోమవారం జారీ చేసింది. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్యాంకు నుంచి రుణం పొందాలంటే అదే సంస్థ సూచించిన బీమా పాలసీని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని చెప్పడం వంటి 'ఫోర్స్డ్ బండ్లింగ్' విధానాలను కొత్త నిబంధనలు నిషేధిస్తున్నాయి. వినియోగదారుడు స్వచ్ఛందంగా ఎంచుకునే లేదా అదనపు ఖర్చు లేని కొన్ని సేవలను కలిపి అందించేందుకు మాత్రం అవకాశం ఉంటుంది.
ఒకటి కంటే ఎక్కువ ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నప్పుడు ఒక్క క్లిక్ లేదా ఒకే అంగీకారంతో అన్నింటికీ సమ్మతి తీసుకోకుండా, ప్రతి ఉత్పత్తికి వినియోగదారుడి స్పష్టమైన అంగీకారం పొందాల్సి ఉంటుంది.
డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి?
వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ రూపకల్పనను ఉపయోగించి వినియోగదారుడిని తాను సాధారణంగా తీసుకోని నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసే పద్ధతులను 'డార్క్ ప్యాటర్న్స్'గా వ్యవహరిస్తారు.
ఉదాహరణకు, వద్దని చెప్పే ఆప్షన్‌ను కనిపించకుండా చేయడం, ముందుగానే ఒక అదనపు సేవను ఎంపిక చేసి ఉంచడం, ధరను మొదట తక్కువగా చూపించి చివరి దశలో అదనపు ఛార్జీలు జోడించడం, సేవను తిరస్కరిస్తే ఏదో కోల్పోతున్నారనే భావన కలిగించే సందేశాలు చూపించడం వంటి పద్ధతులు ఇందులోకి రావచ్చు.
బ్యాంకులు తమ డిజిటల్ వేదికల్లో ఇటువంటి మోసపూరిత లేదా వినియోగదారుడిని తప్పుదారి పట్టించే డిజైన్ పద్ధతులను ఉపయోగించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఆర్థిక ఉత్పత్తిని విక్రయించే ముందు దానికి సంబంధించిన ఫీజులు, నష్టభయం, లాక్-ఇన్ వ్యవధి, మధ్యలో వైదొలిగితే ఉండే ఛార్జీలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని వినియోగదారుడికి స్పష్టంగా తెలియజేయాలి.
బ్యాంకుల తరఫున ఉత్పత్తులను విక్రయించే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు, ఇతర మధ్యవర్తుల ప్రవర్తనపైనా బ్యాంకుల బాధ్యత ఉంటుంది.
తప్పుడు సమాచారం లేదా అనుచిత విక్రయ పద్ధతుల కారణంగా ఒక ఆర్థిక ఉత్పత్తి 'మిస్-సెల్లింగ్'కు గురైనట్లు నిర్ధారణ అయితే వినియోగదారులకు పరిహారం, రీఫండ్‌కు సంబంధించిన వ్యవస్థను కూడా కొత్త నిబంధనలు బలోపేతం చేస్తున్నాయి.
రుణం తీసుకునేటప్పుడు బీమా, పెట్టుబడి ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనన్న భావనతో ఉన్న వినియోగదారులకు తాజా ఆర్‌బీఐ నిబంధనలు ముఖ్యమైన రక్షణగా మారనున్నాయి.




